Friday, February 27, 2009

అసలప్పుడేమి జరిగిందంటే .....


"అక్కా! ఈసారి మటుకు మన పోట్లాటలు ఆపేసి ఏమి జరిగిందో చెప్పేద్దాము."

"అవును మళ్ళీ నువ్వునీవల్ల, నీవల్లా అనకుండా ఉంటే చెప్పేయొచ్చు, అవునసలు ఆరోజు ఏమి సినిమాకి వెళ్ళామే మనము?

"సినిమా? ఏమి సినిమా? ఎలా అడుగుతావక్కా అలా! మనము పడ్డ కష్టాలకి అసలేమి సినిమా చూసామో ఎంటో గుర్తుంటుందా? ఆ కష్టాలు తలుచుకొంటే ఇప్పటికి కడుపు తరుక్కుపోతుంది. అసలు అన్నయ్య ఎంత మాటన్నాడు ఆరోజు, గుర్తుందా?"

"ఆ! గుర్తుంది ఎందుకు గుర్తులేదు తలుచుకొంటే ఇప్పటికి అరికాలి మంట నెత్తికెక్కుతుంది."

"కాని అక్కా! మనము కూడా సంధర్బాన్ని అనుసరించి సమాధానం చెప్పాము గా!"

"ఊ, కాని చిన్నక్క కూడా పాపం జన్మలో మర్చిపోదేమో కదా మనము అలా చెయ్యడం. "

"ఇందులో మనతప్పు కూడా ఉంది అనూ! మరీ సినిమా టిక్కెట్లకి మాత్రమే డబ్బులు తీసుకెళ్ళడం".

"అదొక్కటే అయితే బాగుండును, నాకు కొత్త చెప్పులు లేవు కొనమంటే అమ్మ కొనలేదు ఆ తెల్ల బూట్లు వేసుకొని వచ్చాను, అవేమో సరిపోలేదు బిగబట్టినట్లుగా ఒకటే నెప్పులు కదక్కా!"

"అవును గుర్తుంది. కాని అదృష్టవంతులమే మనము, చివరికి ఇల్లు చేరుకొన్నాము, లేకపోతే ఎక్కడుండేవాళ్ళమో కదా!.

"అవునక్కా అప్పుడు కనీసం ఈ ఫోన్ల సదుపాయం కూడా లేదు. ఎవిటో! ఎవరిని అడగాలో కూడా తెలీదు...అంతా అలా జరిగిపోయింది."

"ఏయ్! చెల్లీ.. చూడు అందరూ బ్లాగు దాటి వెళ్ళిపోతున్నారు, మన మానాన మనం మాట్లాడేసుకొంటున్నాము. అసలు విషయం మన మిత్రులకి చెప్పలేదు. "

"అయ్యో నువ్వు నన్ను అంటావేంటక్కా! మాటల్లో పెట్టేసావు , అమ్మలారా! అయ్యలారా! ఛ ఛ బాలేదు. మిత్రులారా..... ఓకే ఇప్పుడు బాగుంది. అసలప్పుడేమి జరిగిందంటే .....

బ్రేక్.............

ఆహ! కాదు ఒకసారి గతంలోకి వెళ్దాము అక్కడ మేమిద్దరము కొట్టుకొంటూ , తిట్టుకొంటూ వంతులేసుకొని బోల్డు పనులు అవలీలగా చేసేసుకొన్న రోజులన్నమాట. అహహ! అలా నీరసంగా పెట్టకండి ఇప్పుడవన్నీ చెప్పమంటే చెప్పము..
********

"చిన్నక్క (మా పిన్ని కూతురన్నమాట) వచ్చి చాలా రోజులయ్యింది కదా సినిమాకి వెళ్తామమ్మా! మళ్ళీ ఇంకో రెండు రోజులలో వెళ్ళిపోతుంది అక్క, హైదరాబాదులో ఏమి చూసావే అని ఎవరన్నా అడిగితే అక్క ఏమి చెప్తుంది?"అని మేము అంటే....

"ఏంటే చినపాప సినిమాకి వెళ్ళలని ఉందా? "అమ్మ అడిగింది

"ఊ" అని తలూపిన చిన్నక్క ని చూసి , సరె అని అమ్మ ఎంతో ఉదారంగా మమ్మల్ని సినిమాకి పంపింది. మా ఇంటికి కొంచం దూరంలో రైలుపట్టాల మీదుగా వెళ్తే ఓ పేద్ద్ద మట్టిదిబ్బ కనిపిస్తుంది. అది దాటితే సినిమా హాలు. ఆ మట్టిదిబ్బ బండ గుర్తు నాకు. అందుకే అంత భరోసాగా నాకు తెలుసు అని చెప్పాను.

ఆ చెప్తావు , చెప్తావు.. అలా చెప్పబట్టే కదా! ఆరోజలా జరిగింది. నాకు తెలుసు అని చెప్పింది కదండి మా అనూ.. సరె అంటూ మేము ధీమాగా బయల్దేరిపోయాము. వెళ్ళడం సినిమా చూడడం ఇంటర్వెల్ లో ఎవో కొనుక్కొని చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చుచేసెసుకొని బయటపడ్డాము. సినిమా చూసిన ఆనందంలో మాట్లాడుకొంటూ.. అలా అలా మట్టిదిబ్బ దాటేసాము.

"అదేంటి చెల్లీ ! మట్టి దిబ్బ దాటిన తరువాత రైలు పట్టాఅలు కదా రావల్సింది. ఇదెంటి ఏదో ఊరులా ఉంది?"

అవును... అక్క అన్న మాటలకి నేను చుట్టూరా పరికించి చూసాను. "అమ్మో! అవునక్కా! దారి తప్పిపోయాము.. ఇప్పుడేమి చేద్దాము? " బెదురుగా అడిగాను.

"ఏమి చేద్దామేంటి? టైం 7 గంటలయిపోయింది పద! చూద్దాం అలా నడుస్తూ .. ఎదన్నా దారి దొరుకుతుందేమొ.."

అలా ముగ్గురం తప్పిపోయిన అక్కాచెళ్ళెళ్ళం ఓ రెండు గంటలు కుస్తీ పడి ప్రతి రిక్షావాడిని , ఆటోవాడిని అడ్రస్ కనుక్కొంటూ , ఏడుస్తూ... రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇల్లు చేరాము. తరువాత తెలిసింది ఎమిటంటే మేము దాటిన మట్టి దిబ్బలాంటిదే ఇంకొటి అటువైపు వుంది, మాట్లాడుకొంటూ మేము దాటెసి ఊరికి అటువైపు వెళ్ళామన్నమాట. మొత్తానికి మేము మా అక్క పెట్టిన సినిమా ప్రోగ్రాం వల్ల తప్పిపోయి దొరికిన అక్కాచెళ్ళెళ్ళమయ్యాము.

"అదిగో మళ్ళీ మా అక్క పెట్టిన సినిమా ప్రోగ్రాం వల్ల అని నన్నంటావు.. నువ్వు నాకు తెలుసు అనబట్టె కదా అలా బయల్దేరాము"

"అన్నాననుకో అక్కా! అయ్యో చిన్న పిల్ల నిజంగా తెలుసో తెలీదో అనుకొవాలా వద్దా.. అలా బయలేరిపోవడమేనా? "

"అమ్మో! మళ్ళీ మొదలెట్టావు నీ వితండ వాదన, నేను వెళ్తా బాబు. బోల్డు పనులున్నాయి. ఒక్కదాన్నే చేసుకోవాలి."

"భలె గుర్తు చేసావక్కా! వచ్చేవారం మన వంతుల పనుల గురించి చెప్దామా!"

"సరె! చెప్దాము., ఈసారి నేను చెప్తాను. "

ఓకే.
***********

No comments:

Post a Comment